ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో..బాధితులకు సత్వర న్యాయం అందించాలి : ఎంపీ మల్లు రవి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో..బాధితులకు సత్వర న్యాయం అందించాలి :  ఎంపీ మల్లు రవి
  •     విజిలెన్స్​ మానిటరింగ్​ కమిటీ మీటింగ్​లో ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, నిబంధనల ప్రకారం పరిహారం అందజేయాలని ఎంపీ మల్లు రవి సూచించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్  అండ్  మానిటరింగ్  కమిటీ, పీసీఆర్​ 1955, పీవోఏ 1989 అమలుపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదలకు చట్టాలపై అవగాహన కల్పించి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అన్ని సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకునేలా ఎస్సీ, ఎస్టీ యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే ఎఫ్‌‌ఐఆర్‌‌  నమోదు చేసి, బాధితులకు రూ.25 వేలు పరిహారం వెంటనే చెల్లించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చార్జిషీట్  దాఖలు చేసిన తర్వాత 50 శాతం, కేసు పూర్తయ్యాక పూర్తి పరిహారం చెల్లించాలన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్  డివిజన్  పరిధిలోని భూ తగదాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చి, వాటిని పరిష్కరించి ఎస్సీలకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కేసులు, భూతగాదాలు, బాధితులకు నష్టపరిహారం అందించే విషయంపై పలు సూచనలు  చేశారు. కలెక్టర్  బదావత్  సంతోష్  మాట్లాడుతూ జిల్లాలో 234 ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులు రాగా, 219 అట్రాసిటీ కేసులు నమోదు చేశామని తెలిపారు. 170 కేసుల్లో చార్జీషీట్​ దాఖలైందని, ఇప్పటివరకు 219 కేసుల్లో బాధితులకు పరిహారం మంజూరు చేశామన్నారు.19 కేసులకు సంబంధించిన పరిహారం పెండింగ్​లో ఉందన్నారు. అడిషనల్​ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, అడిషనల్​ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సభ్యులు ఎల్లపోగు వెంకటస్వామి, చిన్నగల్ల పరశురాం, గుమ్మకొండ రాములు, వెల్టూరి రేణయ్య, కె చందర్, రెడ్యా  పాల్గొన్నారు.